భారత స్వాతంత్ర్య పోరాటోద్యమ సమయంలో మహాత్మాగాంధీ చేపట్టిన కార్యక్రమాలు అమెరికాపై కూడా ప్రభావం చూపాయనీ.. ఆయన ఆలోచనలు అగ్రరాజ్యంలో నూతన రాజకీయ మార్పులకు నాంది పలికాయని అమెరికాలోని భారత రాయబారి మీరాశంకర్ వ్యాఖ్యానించారు.
కాలిఫోర్నియాలోని శాన్‌డిగోలో 26వ మహాత్మాగాంధీ స్మారక ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా మీరా శంకర్ మాట్లాడుతూ... అహింసద్వారా ఎలాంటిదాన్నయినా సాధించవచ్చునని భారత జాతిపిత మహాత్మాగాంధీ, హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌లు ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు.
శాన్‌డిగో ఇండియన్ అమెరికన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరా శంకర్ మాట్లాడుతూ.. ప్రముఖ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ప్రతిపాదించిన పౌర ఉల్లంఘన ప్రభావంతో గాంధీజీ సత్యాగ్రహోద్యమాన్ని చేపట్టారన్నారు. మహాత్ముడి జీవితం సమస్త అమెరికాతరాన్ని ప్రభావితం చేశాయని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా 17 మంది విద్యార్థులకు మహాత్మాగాంధీ స్మారక స్కాలర్‌షిప్‌లను మీరా శంకర్ ప్రదానం చేశారు. అలాగే నలుగురు విద్యార్థులకు ఏవీఐడీ (ఎడ్వాన్స్‌డ్ వయా ఇండివిడ్యువల్ డిటర్మినేషన్) స్కాలర్‌షిప్‌లను కూడా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ గురు సీకే గుప్తా, మారి అన్నిఫాక్స్ తదితరులు పాల్గొన్నారు.