Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈటీవి ఆధ్వర్యంలో ఘనంగా స్వరాభిషేకం కార్యక్రమం...

ఈటీవి ఆధ్వర్యంలో ఘనంగా స్వరాభిషేకం కార్యక్రమం...
, గురువారం, 20 ఆగస్టు 2015 (13:10 IST)
ఈటీవీ వారు నిర్వహిస్తున్న సుస్వరాల సుమధుర స్వరాభిషేకం కార్యక్రమం ఆగస్టు 15న మన ఫోల్సంలోని 3 స్టేజస్ ఆడిటోరియంలో ఆద్యంతం మనోహరమైన గేయాలతో వీనులవిందు చేస్తూ అత్యంత వైభవంగా జరిగింది. గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి నేతృత్వంలో, గుత్తా నటరాజన్ మరియు కోమటి రామగార్ల ఆతిథ్య (Ruchi Indian Cuisine), ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వెల్లువెత్తిన ప్రవాస తెలుగువారిని చూస్తే, సంగీతానికి ఉన్న అనిర్వచనీయమైన శక్తి ఏమిటో అర్థమవుతుంది. 
 
దాదాపు వెయ్యి మంది ఆహుతుల మధ్య సాగిన ఈ కార్యక్రమం నిజంగా ETV నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలలో ఒక మైలురాయి వంటిది. ముఖ్యంగా బాలుగారు స్వయంగా పాటలను పాడి తరువాత విశ్లేషిస్తూ, తన గత స్మృతులను సభకు విచ్చేసిన అందరితో పంచుకోవడం అంటే నిజంగా అది ఒక గొప్ప వరం. 
 
మధుర గాయని శ్రీమతి సునీత గారు వ్యాఖ్యాతగా మరియు గాయనిగా తన గాత్రంతో ద్విపద విన్యాసం చేసి అందరినీ మంత్రముగ్దులను చేశారు. గాయకులు ఎస్పీ చరణ్ గారు, మహేంద్ర గారు, గాయనీమణులు గీతామాధురి, మాళవిక, శ్రావణ భార్ఘవి తదితరులు సుమధుర గాత్రాలతో, శ్రావ్యమైన పాటలతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. ఎన్నో అరుదైన ఆణిముత్యాల వంటి పాటలను బాలుగారు పాడుతుంటే ప్రత్యక్షంగా వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. హేమచంద్ర పాడిన శివశంకరీ... మొదలు ఎన్నో సుమధుర పాటలు వింటూ అందరూ కొన్నిగంటల పాటు సప్తస్వరాల సాక్షిగా, ఇంద్రధనుస్సు లోని ఏడు వర్ణాలు మిళితమైన, సంగీత స్వరాల జల్లులతో పులకించిపోయారు.
webdunia
 
చివరగా బాలసుబ్రహ్మణ్యం గారు, స్వరాభిషేకం ఇంత దిగ్విజయంగా నిర్వహించిన నటరాజన్ గారినీ, రామ గారినీ సత్కరించి వారి ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన US బ్యాంకు మేనేజర్ రజని ఘోరకవి గారికి, మరియు Greetway Inc CEO రమేష్ వడలి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చివరి వరకూ సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తి గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu