Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన సినిమావాళ్ళు ఇప్పటికైనా మారాలంటోన్న ప్రముఖ నృత్యకళాకారిణి శ్రీమతి లక్ష్మిబాబు(ఎన్.ఆర్.ఐ)

మన సినిమావాళ్ళు ఇప్పటికైనా మారాలంటోన్న ప్రముఖ నృత్యకళాకారిణి శ్రీమతి లక్ష్మిబాబు(ఎన్.ఆర్.ఐ)
, సోమవారం, 29 జూన్ 2020 (20:36 IST)
మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు పరిరక్షించడంలో మన సినిమాలు ముఖ్య పాత్ర పోషించాలి. 'శంకరాభరణం' సినిమా చూసి లక్షలాది తెలుగువాళ్లు సంగీతం నేర్చుకున్నారు. అలాంటి స్వర్ణ యుగం మళ్ళీ రావాలి. మన సినిమావాళ్లు ఇప్పటికయినా మారాలి' అంటున్నారు అమెరికాలో స్థిరపడిన అచ్చ తెలుగు నృత్య కళాకారిణి శ్రీమతి లక్ష్మీబాబు. తెలంగాణా ఆడబిడ్డ అయిన లక్ష్మి.. వివాహానంతరం సికింద్రాబాద్ నుంచి అమెరికాలోని మేరీల్యాండ్ వెళ్లి... గత 30 ఏళ్లుగా భర్తాపిల్లలతో అక్కడే ఉంటున్నారు.
 
'ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా' అన్నట్లు.. భారతీయ మూలాలు మర్చిపోకుండా వాటిని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తమ పిల్లలతోపాటు అక్కడ స్థిరపడ్డ తెలుగు కుటుంబాల పిల్లలు అక్కడి విపరీత ధోరణులకు అలవాటు పడకుండా..  తెలుగు పద్యాలు, శతకాలు, కీర్తనలు, నృత్యాలు నేర్పిస్తూ, మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు చూపిస్తూ.. అక్కడి తెలుగువారందరి అభిమానాన్ని విశేషంగా చూరగొంటున్నారు.
 
స్వతహా కూచిపూడి నాట్యంలో నిష్ణాతురాలైన లక్ష్మీబాబు... నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా చేస్తున్న కరాళ నృత్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రకృతికి మానవాళి చేస్తున్న అపరాధాలను మన్నించమని వేడుకుంటూ.. 'ఆకాశనృత్యం' పేరుతొ ఓ డాన్స్ ఫ్యూజన్ రూపొందించి తన ప్రతిభను తాజాగా ఘనంగా చాటుకుంటున్నారు. ఈ వినూత్న నృత్య రూపకంలో.. మన భారతీయ నృత్యాలు 'కూచిపూడి-సత్రియ-భరతనాట్యం-చావ్-కథక్-మోహినీఘట్టం-ఒడిస్సీ-కథకళి-మణిపురి' మిళితం చేసి ఉండడం విశేషం.
webdunia
అప్పట్లో ప్రపంచాన్ని పట్టి కుదిపేసి, కోట్లాది మరణాలకు కారణమైన ప్లేగు వ్యాధి గురించి 'లయర్' అనే నాటకంలో షేక్స్పియర్ చర్చించినట్లు.. 'ఆకాశ నృత్యం'లో కరోనా గురించి ప్రస్తావించామని లక్ష్మీబాబు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే మక్కువ మెండుగా కలిగిన లక్ష్మీబాబు... ఇప్పటివరకు కుటుంబ బంధాలు, బాధ్యతలతో తలమునకలుగా ఉండి, తన ప్యాషన్ పై దృష్టి పెట్టలేకపోయానని చెబుతారు.
 
ఇప్పుడు నటనపై తనకు గల తపన తీర్చుకునేందుకు ఈమె సన్నాహాలు చేసుకుంటున్నారు. అమెరికాలో షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో తన ప్రతిభకు, వయసుకు తగ్గ పాత్రల్లో నటించే అవకాశం వస్తే.. తప్పక వినియోగించుకుంటానని అంటున్నారు శ్రీమతి లక్ష్మీబాబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో ఫైట్.. నువ్వుల నూనె.. ముక్కులో కొన్ని చుక్కలు..