Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ అసోసియేషన్ ప్రపంచ మహాసభల ఫస్ట్ సెంచరీ(100 రోజుల్లో) అదుర్స్...

అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 9 డెట్రాయిట్): ప్రప్రధమ తెలంగాణ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కన్వీనర్ వినోద్ కుకునూర్ మాట్లాడుతూ, వందరోజుల చిన్న బేబీ లాంటి సంస్థ నుండి అమోఘమయిన ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందించామని, అందరి సహాయ సహకారాలు కావాల

తెలంగాణ అసోసియేషన్ ప్రపంచ మహాసభల ఫస్ట్ సెంచరీ(100 రోజుల్లో) అదుర్స్...
, శనివారం, 9 జులై 2016 (20:35 IST)
అమెరికా తెలంగాణ అసోసియేషన్ (జులై 9 డెట్రాయిట్): ప్రప్రధమ తెలంగాణ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కన్వీనర్ వినోద్ కుకునూర్ మాట్లాడుతూ, వందరోజుల చిన్న బేబీ లాంటి సంస్థ నుండి అమోఘమయిన ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందించామని, అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతూ సభలకు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి రోజు సభలో భారీ సంఖ్యలో అమెరికా నలుమూలల నుండీ ప్రవాస తెలుగు జన సమూహం హాజరయ్యారు. ఆటా(తెలంగాణ) ఆట పాటల్లో తెలంగాణ మార్కు స్పష్టంగా కనిపించింది. పెద్ద సంఖ్యలో తెలంగాణకు చెందిన వివిధ నేతలు, కళాకారులు, కవులు హాజరయ్యారు. 
 
అమెరికాలోనే అత్యంత అధునాతనమైన ఆడియో వీడియో సిస్టం బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ ఆట-పాటలు ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద ముఖ్య ఘట్టాలై సగర్వంగా ఆవిష్కరించబడ్డాయి. తెలంగాణ జానపదాలు హోరేత్తించాయి. జానపదాలు, సాంప్రదాయ నృత్యాలతో ఆటా వేదిక స్వచ్చమైన తెలంగాణ తోరణమై నిలిచింది. తెలంగాణ సాంస్కృతిక రథసారధి రసమయి బాల కిషన్, వారి బృందం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ సభల్లో పాల్గొని డెట్రాయిట్ సభలకు వచ్చినపుడు సొంత ఇంటికి వచ్చిన అనుభవం కలిగిందని రసమయి గారు ఆనందం వ్యక్తం చేసారు. కెనడా నుంచి వచ్చిన గిరిధర్ నాయక్ నృత్యాలు ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి.
 
ఇంకా ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
 
ఇదే తెలంగాణ నాయకుల చేతుల మీదుగా సాంస్కృతిక సమరుజ్జీవన ప్రత్యేక సంచిక(సావనీర్) “పాల పిట్ట” ని ఆవిష్కరించడం జరిగింది. సావనీర్ చైర్మన్ మాట్లాడుతూ నెల రోజుల్లో ఈ సంచికని తేవడం సాహసం అయిందనీ అయినా సాధించగలిగామని ఆనందం వ్యక్తం చేసారు. సంచిక సంపాదకులు కృష్ణ చైతన్య అల్లం మాట్లాడుతూ, వర్షం వెలిసిన తరవాత మట్టివాసన ఎలా ఉంటుందో, ఈ సంచిక ఆటా సభల తరవాత అలాగే నిలిచిపోయేలా రూపొందించామని తెలియచేసారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ వందరోజుల్లో ఏర్పాటైన సంస్థ ఇంత గొప్పగా సభలని నిర్వహించడం అధ్బుతం అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పనులని వివరించి తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమవంతు పాత్రను పోషించాలని, సూచనలు, సలహాలు ఇవ్వాలని, అందరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరవలేదని గుర్తు చేసుకున్నారు.
 
ఇంత గొప్పగా తెలంగాణ సభలు ఎక్కడా జరగలేదని, సొంత గడ్డ మీద ఉన్నట్టే ఉన్నదని ఎం పీ జితేందర్ రెడ్డి గారు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నామని, బంగారు తెలంగాణ సాధించే వరకు నిరంతరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమవంతు పాత్రను పోషించాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ గారు కోరారు. ప్రవాస  తెలంగాణవాసులంతా ఒకే వేదికపై కలుసుకునేలా చేసిన ఆటాను అభినందించారు. మనకంటూ ఒక వేదికను ఉండాల్సిన అవసరాన్ని గుర్తించడం అభినందనీయం అని తెలిపారు.
 
వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ ఆటా సత్కరించుకుంది. హరినాథ్ పొలిచెర్ల గారిని మెడిసిన్ విభాగంలో, మద్దె సతీష్ గారిని సైంటిస్ట్ విభాగంలో, కళల విభాగంలో గిన్నిస్ బుక్‌లో పేరు సంపాదించిన సాయి మన ప్రగడ గార్ని, లైఫ్ టైం అచీవ్మెంట్ విభాగంలో డా. సరోజ్ బజాజ్ గారిని సత్కరించారు. తరవాత యూత్ విభాగంలో పిల్లల్ని కూడా సత్కరించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించబోయే రోజు ఎంతో దూరం లేదని, దాశరథి కళలు గన్న కోటి రతనాల వీణగా మారాలని ఆశించారు.
 
V6 తీన్మార్ ద్వారా రాములమ్మగా మనకు సుపరిచితమైన రమ్య హోస్టెస్‌గా తనదైన శైలిలో యాంకరింగ్‌తో పాటు అక్కడక్కడా నృత్యం కూడా చేసి ఆద్యంతం అందరినీ అలరించింది. ఆద్యంతం అందరి ముఖాల మీద చిరునవ్వుని చెరగనీయకుండా వాఖ్యాతగా రమ్య వ్యవహరించిన తీరు అద్భుతం. అదే తీన్మార్ షో ద్వారా మనకు సుపరిచితమైన మరో యాంకర్ మాటకారి మంగ్లీ కూడా తన మాటలు, ఆటలు, పాటలతో అందరినీ అలరించింది. ప్రతీ రోజూ టీవీలో చూసే సుపరిచితమైన వ్యక్తులు మన మధ్యే తిరుగాడుతూ మన సభలలో సొంత మనుషులలాగా అందరితో కలిసిపోయి సభలకు ప్రత్యేక వన్నె తెచ్చి పెట్టారని ఆటా సభలలో అందరూ అనుకోవడం కనిపించింది.
 
సమాంతరంగా నడిచిన మిలినియల్ మిక్సర్ కార్యక్రమం చెప్పిన సమయానికి మొదలు పెట్టి విజయవంతం చేసారు. వివిధ రకాల కార్యక్రమాలతో యూత్ ఈవెంట్స్ కూడా జరిపారు. మధు సనం, నితిన్ తదితరులు పాల్గొన్న ఈ సభలో డీజే మిక్స్టా యూత్ కార్యక్రమాన్ని ఇండో - అమెరికన్ బ్లెండ్ సంగీతంతో అలరించారు.
 
సభల్లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహం, బుద్ధ విగ్రహం, చార్మినార్, కళా తోరణాలు, జిల్లాల వివరాలు, ఎన్నో చోట్ల కనిపించిన వివిధ తెలంగాణ సాంస్కృతిక కళా రూపాలు, నిర్మల్ బొమ్మలు ఇంకా అనేక తెలంగాణ సంబంధిత డెకరేషన్స్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సాంకేతిక కారణాల వల్ల విందు కాస్త ఆలస్యమయినా పూర్తి విందు భోజనం ఏర్పాటు చేయగలిగారు నిర్వాహకులు. మొత్తం మీద తెలంగాణ సమూహాల సమాఖ్యగా ఉద్భవించిన అమెరికా తెలంగాణ అసోసియేషన్ ప్రథమ తెలంగాణ ప్రపంచ మహా సభలని ఇంత తక్కువ వ్యవధిలో మలచిన తీరు అభినందనీయం. ప్రెసిడెంట్ రాం మోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత సారథ్యంలో మొదటి రోజు సభలు అనుకున్నదానికంటే అద్భుతంగా విజయవంతం అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు రాలుతుందా? మెంతులు, పుల్లటి పెరుగు ప్యాక్‌ వేసుకోండి..!