Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20వ తానా మహాసభల వినోద కార్యక్రమాల వివరాలు...

Advertiesment
20th TANA Conference
, సోమవారం, 22 జూన్ 2015 (18:09 IST)
డిట్రాయిట్లో జూలై 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న 20వ తానా మహాసభలు జయప్రదంగా జరగడానికి అన్ని కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తున్నారు. తానా ప్రెసిడెంట్ శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పెద్దఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వివిధ నగరాల నుండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రముఖ సినీ నటుడు వెంకటేష్, సినీ నిర్మాత సురేష్ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వీరిరువురూ డిట్రాయిట్లో ఉన్నత విద్యను అభ్యసించిన పూర్వవిద్యార్థులు కావడం విశేషం. అల్లరి నరేష్, శ్రీకాంత్, రకుల్ ప్రీత్ సింగ్, కలర్స్ స్వాతి, పూర్ణ, అర్చన ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించనున్నారు.
 
కేంద్రమంత్రివర్యులు వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ అతిథులుగా రానున్నారు. దాదాపు 2 వేలమందికి పైగా వివిధ రంగాలలో ప్రముఖులు, కళాకారులు, రచయితలు, కవులు, శాసనసభ్యులు పాల్గొననున్నారు. డిట్రాయిడ్ యూత్ షో, విజయవాడ సిద్ధార్థ కళాశాల నుండి డ్రమ్మర్స్ ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరింపనున్నాయి. 
 
30 మందితో కూడిన మణిశర్మ సంగీత విభావరిలో ప్రముఖ సినీ గాయనీగాయకులతో డిట్రాయిట్ కోబో వేదిక ఆహుతులను అలరిస్తుంది. ప్రముఖ వ్యాఖ్యాతలు సుమ, ఝాన్సీ, అలీ, శివారెడ్డి తమదైన శైలిలో అందరినీ అలరిస్తారు. సినీ దర్శకులు రవిబాబు దర్శకత్వంలో ఉత్తేజ్, కృష్ణుడు, ప్రభాస్ శ్రీను, చంద్రశేఖర్ హాస్యవల్లరిలో నవ్విస్తారు. ప్రముఖ సినీదర్శకులు రాఘవేంద్ర రావు, నారా రోహిత్, నిఖిల్, నవదీప్, తరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
తానా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో డిట్రాయిట్ ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి సంధ్య ఆత్మకూరి దర్శకత్వంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా హంగులు దిద్దుకుంటోంది. ప్రారంభ నృత్య గీతిక కార్యక్రమానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, యోగిస్వరశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ నృత్య గీతికలో దాదాపు 100 మంది నృత్యకారులు పాల్గొంటారు. 3 రోజులపాటు జరిగే సాంస్కృతిక, ఆధ్యాత్మిక , సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు పలు రకాల వేదికలతో డిట్రాయిట్లో జరుగనున్న తానా మహాసభలు వైభవంగా, విజయవంతంగా జరుగుతాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

Share this Story:

Follow Webdunia telugu