Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20వ తానా మహాసభల కౌంట్ డౌన్, 19 రోజులు... ఆతిథ్య కమిటీ వివరాలు...

20వ తానా మహాసభల కౌంట్ డౌన్, 19 రోజులు... ఆతిథ్య కమిటీ వివరాలు...
, శుక్రవారం, 12 జూన్ 2015 (17:31 IST)
ఆతిథ్య కమిటీ వివరాలు... జూలై నెలలో 2-4న డిట్రాయిట్‌లో జరగనున్ను 20వ TANA మహాసభలను పురస్కరించుకుని శ్రీ గంగాధర్ నాదెళ్ళ మరియు శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చాలా చురుకుగా సాగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ మహాసభలకు పలు రంగాలకు చెందిన అమెరికా, భారత్ మరియు కెనడా నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, అమెరికా, భారత్ నుండి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, నవలా రచయితలు, వేదపండితులు, అష్టావధాన, శతావధాన దిగ్గజాలు, ప్రముఖ తెలుగు పండితులు, తెలుగు కవులు, ప్రముఖ పాత్రికేయులు కళాకారులు మరియు దాతలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
తానా కార్యవర్గం, ఈ సభలను జయప్రదం చేయడానికి వివిధ కమిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన సూచనలను అందచేస్తున్నారు. ఈ మహాసభలకు పదివేలమంది వస్తారని అంచనా. వీరందరికీ “ అతిథి దేవోభవ'' అన్నట్టు, అత్యుత్తమ అతిథి సత్కారాలు అందచేయడానికి తానా కార్యవర్గం “ హాస్పిటాలిటీ ( ఆతిథ్య) కమిటీ” ని నియమించారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులందరికీ అత్యుత్తమ సత్కార సేవలు అందించడమే ఈ కమిటీ ముఖ్యఉద్దేశం. ఈ కమిటీకి దంతేశ్వర రావు చైర్మెన్‌గా, ప్రసాద్ బేతంచెర్ల, హర్ష అంచే మరియు రమేష్ భోగి కో-చైర్ పర్సన్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీతో ముఖాముఖీ మరియు కమిటీ విధివిధానాలపై సంప్రదించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
1)ఈ సంవత్సరం జూలై నెలలో డిట్రాయిట్లో జరగనున్న తానా సమావేశాలకు హాస్పిటాలిటీ కమిటీ విభాగం ముఖ్య లక్ష్యం గూర్చి వివరించండి? 
హాస్పిటాలిటీ కమిటీ ముఖ్యోద్దేశం ఆ పేరులోనే వుంది. హాస్పిటాలిటీ అనగా తెలుగులో "అతిథి మర్యాద" అనే అర్ధం. అదే మా ముఖ్యోద్దేశం. తానా 20వ మహాసభలు సందర్భంగా సుమారుగా 350 మంది అతిరధమహారధులను మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది. కావున ఈ సభలకు విచ్చేసిన అతిథులందరికి సకల సదుపాయములు కల్పించి, వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వారికి అడుగడుగనా సహాయ పడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాము. వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చి ఒక మంచి సాంప్రదాయ కార్యక్రమానికి హాజరయ్యి, మరలా వాళ్ళ ఇంటికి చేరుకొనే భావన కలిగేటట్లు మరియు ఇది ఒక తీపిగుర్తుగా ఉండేటట్లు చెయ్యాలని మా ఆకాంక్ష. అతిథి దేవోభవా అనే సూక్తి మా ఉద్దేశం
 
2)  తానా మహాసభలకి చాలామంది మహామహులు అన్ని రంగాలనుండి విచ్చేస్తారు కదా? వీరికి ఏ విధంగా సాదర గౌరవాలు, అతిథి మర్యాదల ఏర్పాట్లు జరుగుతాయి? ఇంతమందికి ఆతిథ్యం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మీ కమిటీ కార్యవర్గ సభ్యులు ఏవిధంగా కార్యసన్నద్ధులై ఉన్నారు?
ఈ సభలకు వివిధ రంగాల నుంచి అనగా రాజకీయ, సినీ - నాటక, విధ్వాంసుల, తెలుగు భాషా, వ్యవసాయ, ఆధ్యాత్మిక, ఆరోగ్య సంక్షేమ రంగాల నుంచి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. వీరిలో చాలామంది ఇక్కడ పరిసరాలకు, పద్ధతులకు, ప్రదేశానికి కొత్తగా వుంటారు కనుక, వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మా ఆతిథ్య కమిటీ ఎల్లప్పుడూ అనుసరిస్తూ వున్నాము. మా ఆతిథ్య కమిటీలో సుమారుగా 50 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. వచ్చే ప్రతీ అతిథి దగ్గర సుమారు మా కమిటీ నుంచి 5 కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ ఇస్తున్నాము. దీని వలన వాళ్లకి మేము సమయానికి సహాయం చేయడం సులభమవుతుంది. అలాగే వాళ్ళని విమానాశ్రయం నుంచి అతిథి వసతి గది మరియు వాళ్ళ రూం నుంచి కార్యక్రమానికి వెళ్ళడానికి ఆయా కమిటీలతో కాంటాక్ట్ చేసి తగిన సదుపాయములు కల్పిస్తాము. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ మున్నగు విషయాల గురించి తగిన ఇన్ఫర్మేషన్ కూడా ముందుగానే ప్రొవైడ్ చెస్తాము.
 
3) హాస్పిటాలిటీ కమిటీ గురించి , కమిటీ సభ్యుల గురించి వివరాలు చెప్తారా?
ఈ ఆతిథ్య కమిటీలో సుమారుగా 50మంది సభ్యులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ప్రొఫెషనల్స్. వాళ్ళు తమంతట తాముగా ఈ కమిటీలో సహాయం చేయడానికి ముందుకొచ్చిన వారు.. మా కమిటీలో కార్యకర్తలు అందరూ వివిధ కమిటీలతో భేటి అయ్యి, వాళ్ళ నుంచి తగిన సమాచారము తీసుకొంటున్నారు.. అలాగే వచ్చే అతిథులకు ఎటువంటి సహాయం అయినా అందించడానికి సన్నద్ధం అవుతున్నారు.
 
4) హాస్పిటాలిటీ విభాగం అన్నది చాల బాధ్యత గల విభాగం. ఈ విభాగంలో పనిచేస్తున్న వారికీ ఈ రోజు నుండి మహాసభలు జరిగే వరకూ చాలా ఒత్తిడి ఉంటుంది. వీటిని అధిగమించడానికి ఏ విధమైన ప్రణాళికను రూపొందించుకున్నారు ?  
ఈసారి ఒక క్రొత్త పద్ధతిలో ఇంతవరుకు ఎప్పుడూ జరగని విధంగా, ఒక వినూత్న ప్రణాళిక ప్రకారం అతిథులను ఆహ్వానించడానికి, ఆదరంచడానికి కలిసికట్టుగా చేస్తున్నాము. అతిథులకు ఎక్కడయినా మా కమిటీ నుంచి సహాయం అందేటట్లు ప్లాన్ చేసుకొంటున్నాము.
 
5)అతిథులను దృష్టిలో పెట్టుకుని, వారి భద్రతల గురించి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఈసారి అతిథుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. అందులో భాగంగానే, మా కన్వీనర్ శ్రీ నాదెళ్ళ గంగాధర్ గారు, ఒక ప్రత్యేకమైన మరియు బాగా ప్రావీణ్యమున్న కమిటీని నియమించారు. ఈ కమిటీ లోకల్ డిట్రాయిట్ పోలీస్ డిపార్టుమెంటుతో మాట్లాడి అడుగడునా పోలీస్ భద్రత ఉండేటట్లు చూస్తున్నారు. అలాగే, అతిథులకు విరివిగా రవాణా సదుపాయములు కూడా సమకూర్చుతున్నారు. అలాగే అతిథులందరికి దగ్గరగా ఉండేటట్లు హోటల్స్ కూడా బుక్ చెయ్యడం జరిగింది. ఈ ఏర్పట్లన్నిటితో పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేస్తున్నాము.
 
6) తానా 20 వ మహాసభలు విజయవంతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి కొంచం వివరించి చెప్తారా ?
ఈసారి తానా 20వ మహాసభలు విజయవంతం అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా ముందుగానే సుమారుగా 6000 రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. అలాగే అన్ని హోటల్స్ కూడా చాలావరకు బుక్ అయిపోయాయి. అలాగే ఈ 20వ తానా మహాసభలు అవకాశం డిట్రాయిట్ ప్రజలకు రావడం, అందువలన డిట్రాయిట్ ప్రజలందరూ చాలా గర్వంగా, ఎప్పుడూ గుర్తుండిపోయేటట్లు చెయ్యాలనే దృఢసంకల్పంతో వున్నారు. కావున ఈసారి ఈ మహాసభలు ఒక పండగలా డిట్రాయిట్లో జరుగుతాయనడంలో సందేహం లేదు
 
7) తానా మహాసభలను పునస్కరించుకుని మీ కమిటీ తరపున ప్రత్యేకంగా ఏమైనా చెప్పదలచుకున్నారా?
వివిధ కమిటీలలో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రత్యేకంగా డోనార్(దాతల) కేటగిరిలో $250 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం వాలంటీర్లకు, దాతలకు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కమిటీ సభ్యులు ఎవరయితే ఇంకా నమోదు చేసుకోలేదో వారిని ఈ అవకాశం సద్వినియోగాపరచుకోమని చెప్తున్నాం. అలాగే ఇప్పటి నుండి ప్రతి ఆదివారం 3 లక్కీ డ్రాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి పేర్లల్లో తీస్తాము. ఈ లక్కీ డ్రాలో గెలుపొందినవారికి పట్టుచీరలు ఇవ్వడం జరుగుతుంది..అన్ని వివరాలకు TANA website చూడండి, TANA2015.org

Share this Story:

Follow Webdunia telugu