ఇటీవలనే ఒక సింగపూర్ నౌకను హైజాక్ చేసి ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు తాజాగా మరో భారతీయ నౌకను హైజాక్ చేశారు. సీషెల్స్ సమీపం నుంచి పనామా వెళ్తున్న "ఎంవీ ఏవన్ ఖాలిక్" అనే నౌకపై సోమాలియా పైరేట్లు దాడిచేసి అందులోని 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయమై అంతర్జాతీయ నావికా సంఘమైన "ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో"కు చెందిన పైరసీ రిపోర్టింగ్ కేంద్రం అధినేత నోయెల్ చూంగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారతీయుల నిర్వహణలో ఉన్న ఈ నౌకలోని సిబ్బందిలో 24మంది భారతీయులు కాగా.. మిగిలిన ఇద్దరూ మయన్మార్ దేశస్థులని వివరించారు.
22 వేల టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ఓడను హైజాక్ చేసిన సమయానికి నాటో దళ నౌకకు ఎనిమిదిగంటల దూరంలో మాత్రమే ఉందని.. నాటో పైరసీ కేంద్ర వ్యతిరేక ప్రతినిధి తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ఇటలీకి చెందిన జోలీ రోసా అనే 32 వేల టన్నుల సామర్థ్యం ఉన్న మరో నౌకపై కూడా సోమాలియా పైరేట్లు కాల్పులు జరిపి హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి పప్పులేమీ ఉడకలేదు.