Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూపర్ కంప్యూటర్ సృష్టికర్త మన ఆంధ్రుడే...!!

Advertiesment
ఎన్ఆర్ఐ
FILE
ఊహాతీతమైన వేగంతో లెక్కింపులు చేసే సామర్థ్యం కలిగిన సూపర్ కంప్యూటర్‌ను అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుడు ఆలూరు శ్రీనివాస్ రూపొందించారు. క్షణానికి 28.16 లక్షల కోట్ల లెక్కింపులు చేయగల ఈ అద్భుతమైన సూపర్ కంప్యూటర్‌ను సృష్టించిన శ్రీనివాస్... అయోవా స్టేట్ వర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

"సిస్టార్మ్" అనే పేరుతో రూపొందించిన ఈ కంప్యూటర్ అయోవా స్టేట్ వర్సిటీలోని సూపర్ కంప్యూటర్లలో రెండవదిగా పేరు సంపాదించింది. ఐబీఎం సంస్థ రూపొందించిన బ్లూజీన్/ఎల్ సూపర్ కంప్యూటర్ (సిబ్లూ) 2006లో ఈ వర్సిటీ క్యాంపస్‌లోకి అడుగు పెట్టింది. అది సెకనుకు 5.7 లక్షల కోట్ల లెక్కింపుల్ని మాత్రమే చేయగలదు.

అయితే తాజాగా మన ప్రవాసాంధ్రుడు శ్రీనివాస్ రూపొందించిన సూపర్ కంప్యూటర్ మాత్రం సెకనుకు 28.16 లక్షల కోట్ల లెక్కింపుల్ని చేయగలదు. అయితే సిస్టార్మ్‌కు ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాలో మాత్రం ఇంకా చోటు లభించలేదు. మూడేళ్ల కిందటే ఆన్‌లైన్‌లోకి వెళ్లిన సిబ్లూ ఈ జాబితాలో 99వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... సూపర్ కంప్యూటర్ పరీక్షల్లో వాస్తవంగా సిస్టార్మ్ సెకనుకు 15.44 లక్షల కోట్ల లెక్కింపుల్ని చేయగలిగిందని, దీనికి ముందు అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందిన సిబ్లూ సెకనుకు 4.7 లక్షల కోట్ల లెక్కింపుల్ని మాత్రమే చేయగలిగిందని చెప్పారు.

సిబ్లూ కంటే తాజాగా తాను రూపొందించిన సిస్టార్మ్ 3.3 రెట్లు వేగంగా పనిచేయగలదని శాస్త్రీయంగా కూడా రుజువైందని శ్రీనివాస్ వివరించారు. కాగా... పదార్థ శాస్త్రాలు, పవర్ సిస్టమ్స్, సిస్టమ్స్ బయోలజీ లాంటి శాస్త్రాలలో పరిశోధనలకు అనువుగా సిస్టార్మ్ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu