Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థుల భద్రతపై రూడ్ అత్యున్నత సమావేశం

Advertiesment
ఎన్ఆర్ఐ
భారత విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు విద్యార్థుల భద్రతకు సంబంధించి అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్‌రూడ్ సమస్య తీవ్రతను కూలంకషంగా చర్చించారు.

పలు రాష్ట్రాల ప్రధానులు హాజరైన ఈ సమావేశంలో... ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్ట్రాటజీ (ఐఎస్ఎస్) పథకానికి ఆమోదముద్ర వేశారు. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియాను సురక్షితమైన దేశంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేయనున్నట్లు సమావేశం అనంతరం రూడ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

భారతీయ విద్యార్థులపై చోటు చేసుకుంటున్న దాడులు, తదనంతరం నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో తమ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించనున్నట్లు కెవిన్ రూడ్ ప్రకటించారు. ఈ బృందం జూలై 5 నుంచి 15 తేదీల వరకు భారత్ రాజధాని న్యూఢిల్లీతోపాటు ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నె, అహ్మదాబాద్ తదితర నగరాల్లో పర్యటించనుందని ఆయన వివరించారు.

తమ అత్యున్నతస్థాయీ బృందం భారత్‌లోని ఆయా నగరాల్లోన ప్రభుత్వాలతో సమావేశం అవటమేగాక, ప్రజలను కూడా కలుసుకుంటుందని కెవిన్ రూడ్ పేర్కొన్నారు. ఈ బృందంలో సీనియర్ పోలీసు అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ బృందం ఐదవతేదీ (ఆదివారం)న ఢిల్లీ చేరుకుంటుందన్నారు.

అదలా ఉంచితే... ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకుగానూ... సెప్టెంబర్ 14, 15 తేదీలలో అంతర్జాతీయ విద్యార్థులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా కాన్‌బెర్రాలో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్లు రూడ్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu