Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యాయపోరాటంలో నెగ్గిన ఎన్నారై కహ్లాన్

Advertiesment
ఎన్ఆర్ఐ
తన జీవితంతో చెలగాటమాడిన కెనడా ఆసుపత్రి వర్గాలపై ఒక ఇండియన్-కెనడియన్ న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు ఘన విజయం సాధించారు. పది సంవత్సరాల నుంచి తాను అనుభవిస్తున్న బాధకు ఆసుపత్రి వర్గాల నుంచి ఈయన ఐదు మిలియన్ డాలర్ల (సుమారుగా 20 కోట్లు) భారీ పరిహారాన్నే రాబట్టారు.

వివరాల్లోకి వస్తే... షాన్ కహ్లాన్ (41) తన భార్య మిచెల్లీతో వాంకోవర్ శివారులో నివసిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయనకు వెన్నుముఖ కింది భాగంలో నొప్పి రావడంతో 1999 సంవత్సరంలో వాంకోవర్ కోస్టల్ హెల్త్ అథారిటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఈయనను పరీక్షించిన వైద్యులు రేడియోలాజిస్ట్ వద్దకు పంపగా, సీటీ స్కాన్ చేసిన రేడియోలాజిస్ట్ ఆయనకు జబ్బేమీ లేదని నిర్ధారించి చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఆయన అప్పటికే ట్యూబర్‌క్యులోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.

వెన్నునొప్పి రోజు రోజుకూ అధికమవటంతో షాన్ కహ్లాన్ ఒక ఏడాది తరువాత మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్లారు. ఈయనను పరీక్షించిన వైద్యులు.. టీబీ మెనింజైటిస్ అనే వ్యాధి సోకిందని, జబ్బు బాగా ముదిరిపోయినందువల్ల తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై షాన్ కహ్లాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఆసుపత్రి వర్గాలు, రోగి వాదనలను విన్న బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్టు కహ్లాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంవత్సరం ముందుగా వ్యాధిని సరిగా నిర్ధారించినట్లయితే ఆయన ఇప్పటికే బాగా కోలుకుని ఉండేవారని, ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించిన న్యాయస్థానం... కహ్లాన్‌కు నష్టపరిహారంగా ఐదు మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu