Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"తానా" మహాసభల ప్రవేశ రుసుం తగ్గింపు

Advertiesment
ఎన్ఆర్ఐ
జూలై నెలలో షికాగో నగరంలో జరుగనున్న, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 17వ ద్వైవార్షిక మహాసభలకు హాజరయ్యే వారి ప్రవేశ రుసుమును తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మాంద్యం ప్రభావం తెలుగువారిపై కూడా ఉందన్న వాస్తవాన్ని గ్రహించిన తాము ఈ దఫా మహాసభలకు హాజరయ్యే వారి కోసం రోజువారీ పాసులను అందుబాటులోకి తెచ్చినట్లు తానా వెల్లడించింది.

మహాసభలను విజయవంతం చేసేందుకు సంబంధిత కమిటీలు నిర్విరామంగా పనిచేస్తున్నాయనీ... జూలై 2, 3, 4 తేదీలలో జరిగే ఈ సభలకు పదివేలమంది హాజరవుతారని భావిస్తున్నట్లు తానా వర్గాల కథనం. షికాగోలోని సువిశాల రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ మహాసభలకు మన రాష్ట్రంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వందలాది తెలుగు ప్రముఖులు హాజరు కానున్నారు.

ఇదిలా ఉంటే... వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రత్యేక పాసులను అందుబాటులోకి తెచ్చినట్లు తానా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎప్పటిలాగే కుటుంబాల రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగిస్తూనే, భోజనం ప్యాకేజీతో సంబంధం లేకుండా కేవలం సభలకు వచ్చేవారికి రోజువారీ పాసుల అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తానా అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకరోజు పాసుకు 50 డాలర్లు, రెండు రోజుల పాసుకు 80 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, రోజువారీ పాసులతో సభలకు హాజరయ్యేవారు ఆహార పదార్థాలకు విడిగా డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. తాము ప్రకటించిన తగ్గింపు ప్యాకేజీతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయని తానా వెల్లడించింది. "సాంకేతిక వికాసం-సాంస్కృతిక విన్యాసం" అనే నినాదంతో ఈ మహాసభలలో వినోద కార్యక్రమాలతోపాటు, వివిధ రంగాల్లోని తెలుగువారి ఉన్నతికి తోడ్పడగల సాంకేతిక, ఆధ్యాత్మిక అంశాలకు సముచిత ప్రాధాన్యం కల్పించనున్నట్లు తానా వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu