Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాత్యహంకార దాడులతో "వర్సిటీ"లకు దెబ్బ...!

జాత్యహంకార దాడులతో
ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులవల్ల అక్కడి యూనివర్సిటీలన్నీ భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయి ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. దాడులతో భీతిల్లిన విద్యార్థులు ఆందోళనకు గురై వర్సిటీలను వదిలి స్వదేశాలకు వెళ్లిపోతుండటమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

ఈ విషయమై మోనాష్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రిఛర్డ్ లార్కిన్స్ మాట్లాడుతూ... దాడుల వల్ల విద్యార్థులు స్వదేశాలకు తరలిపోవడంతో, వారి నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని వాపోయారు. దీంతో వర్సిటీలన్నీ ఆర్థికంగా దెబ్బతిని దుర్భల స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ రకంగా విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే సుమారు 15 మిలియన్ డాలర్లను వర్సిటీలు కోల్పోయాయని లార్కిన్స్ వివరించారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే... విద్యార్థులకు క్యాంపస్‌లలోనూ, వ్యక్తిగతంగానూ పుర్తి భద్రతను కల్పించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... విదేశీ విద్యార్థులు మృతి చెందడం వెనుకగల కారణాలను వెల్లడి చేయాలంటూ "ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్" విభాగం ఆ దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను డిమాండ్ చేసింది. గడచిన 12 నెలల కాలంలో నమోదైన 51 విదేశీ విద్యార్థుల మరణాలలో 34 కేసులకు సంబంధించిన కారణాలు తెలియటం లేదని, ప్రభుత్వం చెప్పడాన్ని సంఘం ఈ సందర్భంగా తప్పుబట్టింది.

అవి హత్యలో, ఆత్మహత్యలో తెలియజేయాల్సిన బాధ్యత ఆయా విద్యా సంస్థలపై ఉందని పై సంఘం ప్రతినిధి వెసా చావూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నందున వీటికిగల పూర్తి కారణాలు తెలియాల్సిందేనని, ఆ బాధ్యత విశ్వవిద్యాలయాలు కూడా గుర్తించాలని వెసా కోరారు.

Share this Story:

Follow Webdunia telugu