ఎన్నారై అమిత్ గోయల్‌కు అరుదైన గౌరవం
భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త అమిత్ గోయల్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన "వరల్డ్ టెక్నాలజీ నెట్‌వర్క్" అవార్డుకు ఈయన ఎంపికయ్యారు. ఓక్ రిడ్జ్ నేషనల్ లేబరేటరీకి చెందిన భౌతిక శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న అమిత్‌కు, వరల్డ్ టెక్నాలజీ నెట్‌వర్క్స్‌కు చెందిన మెటీరియల్స్ అవార్డు తుది ఫైనలిస్టుల జాబితో చోటు దక్కింది.ఈ విషయమై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీస్ ఓక్ రిడ్జ్ నేషనల్ లేబరేటరీ (ఓఆర్ఎన్ఎల్) ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కాగా... ప్రత్యేక పరిశోధకుడిగా గుర్తింపు పొందిన అమిత్ సుమారు 300 ప్రచురిత గ్రంథాలు, 53 పేటేంట్‌లను కలిగి ఉండటం విశేషంగా చెప్పవచ్చు.ఇదిలా ఉంటే... 1991లో న్యూయార్క్‌లోని రోచెస్టర్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం మరియు ఇంజనీరింగ్‌లలో అమిత్ డాక్టరేట్ పొందారు. అదే సంవత్సరంలో ఆయన ఓఆర్ఎన్ఎల్‌లో చేరారు. ఆ తరువాత వరల్డ్ టెక్నాలజీ నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఈయన... తన టీం సభ్యులతో కలిసి ఇటీవలనే ఆర్ అండ్ డి 100 అవార్డును సైతం గెలుపొందారు.వృత్తి నైపుణ్యం కలిగిన మరో ఆరు సొసైటీల్లో కూడా అమిత్ గోయల్ పరిశోధకుడిగా పేరుగాంచారు. ది అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్, ది అమెరికన్ ఫిజికల్ సొసైటీ, ది వరల్డ్ ఇన్నొవేషన్ ఫౌండేషన్, ది అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటల్స్, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ది అమెరికన్ సెరామిక్ సొసైటీలకు చెందిన పరిశోధకుడిగా మన ప్రవాస భారతీయుడైన అమిత్ తన అమూల్యమైన సేవలను అందిస్తున్నారు.