ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరుస జాత్యహంకార దాడుల పరంపరకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కనిపించటం లేదు. తాజాగా సచిన్ అనే భారత విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన ఈ దాడిలో సచిన్‌ను గాయపరచడమే గాకుండా అతని వద్ద నుంచి నగదు, బంగారాన్ని కూడా దోచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సచిన్ గురువారం ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థుల సమాఖ్య (ఫిసా)కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాడు. ఇతను సదరన్ క్రాస్‌కు చెందిన ట్వీడ్ హెడ్స్ గోల్డ్ కోస్ట్ విద్యార్థి కాగా, కోలంగటా పోలీస్ స్టేషన్ సమీపంలో దాడికి గురయ్యాడు. దాడికి పాల్పడిన దుండగులు తన వద్ద నుంచి డబ్బు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్, బంగారు గొలుసునూ దోచుకున్నారని సచిన్ తెలిపాడు.
ఈ దాడిలో గాయపడ్డ తన ముఖంపై ఐదు కుట్లు పడినట్లు సచిన్ ఈ-మెయిల్‌లో వెల్లడించాడు. ఈ సంఘటనపై పోలీస్ కేసు కూడా పెట్టాననీ... అయితే పోలీసుల అంతగా చర్యలేమీ తీసుకున్నట్లు కనబడటం లేదని సచిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియాలో దాడులకు గురయిన భారతీయుల సంఖ్య తాజా సంఘటనతో కలిపి 17కు పెరగడం గమనార్హం.
ఇదిలా ఉంటే... ఫిసా వ్యవస్థాపకుడు గౌతం గుప్తా మాట్లాడుతూ... భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో విశ్వాసం పాదుకొల్పే చర్యలను భారత దౌత్య కార్యాలయం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దాడుల గురించి తమకు ప్రతిరోజూ ఈ-మెయిళ్లు అందుతున్నాయని ఆయన వివరించారు.