Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"అమెరికా తెలుగు సంఘాల" మహాసభల సందడి

Advertiesment
ఎన్ఆర్ఐ
అమెరికాలో తెలుగు సంఘాలైన తానా, నాట్స్, చికాగో తెలుగు సంఘాల (సీటీఏ) వేడుకలతో చికాగోలోని ఫ్లోరిడాలో అచ్చతెలుగు వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ మూడు సంఘాల వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇక్కడికి తరలివచ్చారు.

"సాంకేతిక వికాసం-సాంస్కృతిక విన్యాసం" పేరుతో తానా జూలై 2, 3, 4 తేదీలలో ద్వైవార్షిక మహాసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చికాగోలోని రోజ్‌మౌంట్ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఎత్తున జరుగుతున్న ఈ వేడుకలు రెండవతేదీ సాయంత్రం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఇల్లినాయిస్ రాష్ట్ర గవర్నర్ ప్యాట్ క్విన్, భారత రాయభారి మీరాశంకర్ ముఖ్య అతిథులుగా హాజరవనున్న ఈ మహాసభల్లో... ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి, నేషనల్ నాలెడ్జి కమీషన్ ఛైర్మన్ శామ్ పిట్రోడాలు హాజరుకానున్నారు.

అలాగే.. రాష్ట్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ఎన్నికల ప్రధానాధికారి, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ వైవీరెడ్డి, వ్యాపారవేత్త గల్లా, సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు కూడా ఈ మహాసభల్లో పాల్గోనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. తానా సంస్థ ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకుజీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయనుంది.

ఇక చికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) కూడా జూలై 2, 3 తేదీలలో వేడుకలను నిర్వహిస్తోంది. ఓడియమ్ ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు సినీ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, నటులు అలీ, హే, మమతా మోహన్‌దాస్, నికిత, సంజన తదితరులు హాజరై, పలు ప్రదర్శనలను ఇవ్వనున్నారు.

నాట్స్ వ్యవస్థాపక వేడుకలు కూడా జూలై 2, 3, 4 తేదీలలోనే ఓర్లాండోలోని ఆరంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్నాయి. స్వామి చిదాత్మానంద, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, మృదంగం విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, గజల్ శ్రీనివాస్, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావులతో పాటు పలువురు కళాకారులు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. ఆద్యంతం పోటాపోటీగా సాగే ఈ మూడు తెలుగు సంఘాల వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu