Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో పోటాపోటీగా తెలుగు సంఘాల మహాసభలు

Advertiesment
ఎన్ఆర్ఐ
గత పాతిక సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగువారికి ఆంధ్రరాష్ట్రంలోని ఆంధ్రులకు వారధిగా నిలిచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఇటీవలనే ఆవిర్భవించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)లు వేరువేరుగా నిర్వహిస్తున్న మహాసభల సంబరాలు పోటాపోటీగా జరుగనున్నాయి.

తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల వేదికగా నిర్వహిస్తున్న ఈ సంబరాలకు పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులందరూ తరలివెళ్తున్నారు. తానా మహాసభలను జూలై 2 నుంచి 4వ తేదీ వరకూ షికాగోలోని రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తుండగా.. నాట్స్ ఇదే తేదీలలో ఓర్లాండోలోని ఆరెంజ్ కంట్రీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తోంది.

ఈ రెండు తెలుగు సంఘాల మహాసభలకు హైదరాబాద్ నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. సినీ రంగ ప్రముఖులు, సాహితీ ఉద్దండులు, పారిశ్రామిక ధిగ్గజాలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయనేతలు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ సంబరాలకు వేంచేస్తున్నారు.

అమెరికాకు ఆంధ్రప్రదేశ్‌కు మధ్య తెలుగువారికి ఒక వారధిలాగా 1977లో ఏర్పడిన తానా ప్రతి రెండేళ్లకోసారి ద్వైవార్షిక మహాసభలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది తానా సభలు నిర్వహిస్తే, మరుసటి ఏడాది అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) సభలు నిర్వహిస్తుండేవారు.

అయితే ఇటీవల అంతర్గత విభేదాలతో తానా నుంచి విడిపోయిన కొందరు ఏర్పాటు చేసిన నాట్స్ కూడా ఈ ఏడాది తొలిసారిగా "అమెరికా తెలుగు సంబరాలు" పేరుతో వేడుకలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాలో మహాసభల వేడుకల నిర్వహణను ఇరు సంస్థలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకోసం తానా, నాట్స్‌లకు చెందిన వందలాది కార్యకర్తలు, సభ్యులు పోటాపోటీగా సభల ఏర్పాట్లలో నిమగ్నులైనారు.

ఇదిలా ఉంటే... ప్రపంచమంతటా విస్తరించిన ఆర్థికమాంద్యం ప్రభావం తానా, నాట్స్‌లపై పడవచ్చునని విశ్లేషకులు భావిస్తుంటే, సభలకోసం కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఏర్పాట్లు మాత్రం ప్రవాసాంధ్రులతోపాటు, స్వదేశంలోని ప్రముఖులను సైతం ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. ఈ సంబరాల సమయం దగ్గర పడటంతో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులు అమెరికాకు ప్రయాణమయిన సంగతి విదితమే...!!

Share this Story:

Follow Webdunia telugu