రొయ్యలను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. రొయ్యలలో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. రొయ్యల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. తరచూ రొయ్యలను తీసుకుంటే కావాల్సినంత బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాహారం రొయ్యలే. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ.
రక్తహీనతకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. మూత్రకోశ క్యాన్సర్ నివారిణిగా, దీంతో పాటు వంధ్యత్వంను పోగొడుతుంది. రొయ్యలను ఆహారంగా తీసుకోవటం వల్ల మానసిక బలహీనతలూ పోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే వీటిని ఎక్కువగా ఉడికించకూడదు. రొయ్యలు ఉండే క్యాల్షియం పొందాలంటే అతి తక్కువ మంటపై రొయ్యలు ఉడికించుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇప్పుడు రొయ్యల పలావ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...
కావలసిన పదార్ధాలు :-
బాస్మతి బియ్యం : 1/2 కేజీ
ఉల్లిపాయలు - 2 తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత
పచ్చి మిర్చి- తగినంత
లవంగాలు - 10
దాల్చినచెక్క - 1
టొమాటోలు - 4 తరిగినవి
రొయ్యలు - 1 కప్పు
కొబ్బరిపాలు - 1/2 కప్పు
పుదీనా ఆకులు - తగినంత
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర కట్ట - 1
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 1/2 కప్పు
తయారు చేయు విధానం :-
ముందుగా గ్యాస్ మీద మీద కుక్కర్ పెట్టి, నెయ్యి వేసి, కాగిన తరువాత మసాలా దినుసులు వేసి వేగనిచ్చి అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చి మిర్చి, టమోటాలు, కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేగనిచ్చి రొయ్యలు వేసి బాగా వేగాకా అందులో కొబ్బరి పాలు పొయ్యాలి. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. కొద్దిసేపు తరువాత బియ్యం వేసి కలిపాకా పొదీనా, కొత్తిమీర జల్లి, తగినంత నీరుపోసి మూత పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచి దించేయాలి. అంతే ఎంతో రుచిగా నోరూరించే రొయ్యల పలావ్ రెడీ!