నవరాత్రి ఉత్సవాన్ని జరుపుకునే అనేక మంది తమ తమ ఇళ్లలో బొమ్మల కొలువును వుంచుతారు. అయితే ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు కొన్ని నియమాలు వున్నాయి. సాధారణంగా 5, 7, 9 మెట్లపై బొమ్మల కొలువును వుంచాలి.
దసరా నవరాత్రులలో ఈ సరదా బొమ్మల కొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్థోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.
పైమెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచు తారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు.
మధ్య భాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా భావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు.
మెట్లపై తెల్లని వస్త్రము పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు. ప్రాంతీయ భేదాలవలన బొమ్మలను అమ ర్చడంలో కొన్ని భేదాలు కనిపిస్తాయి. దేవుని బొమ్మలైన వినాయకుడు, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర్య సమరయోధుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు మొదలగునవి ఈ బొమ్మల కొలువలో అమర్చుతారు.