విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి.
ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని పండితులు అంటున్నారు. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుందని తెలిపారు.
పదవ రోజు అనగా విజయ దశమి నాడు ఉదయాన్నే లేచి తలా స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు. పిండి వంటలు వండుకుని బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు.
సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు. కొన్ని ప్రాంతాల వాళ్లు అయితే రావణాసురుని వధకి గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, పటాకులు వంటివి కాల్చి సంబురాలు చేస్తారు.