Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా పండుగ ప్రాముఖ్యత తెలుసుకుందాం...

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణ

దసరా పండుగ ప్రాముఖ్యత తెలుసుకుందాం...
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (19:03 IST)
నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.
 
నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవ రాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
 
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. 
 
పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. 
 
శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి, పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు 7 లక్షల లడ్డూలు... తితిదే ఈఓ