వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మేలే జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగుల ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయింది. కాబట్టి కంపెనీలకు ఇదొక అద్భుతమైన అవకాశంలా కనిపిస్తోంది. దీంతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తూ పోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)కి మాత్రమే పరిమితమైన కాన్సెప్ట్.
లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని రంగాలకూ విస్తరించింది. కేవలం తయారీ రంగంలో తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సిన సిబ్బంది మినహా మిగితా అందరూ ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు మొదలయ్యాయి.
తొలుత ఇదొక తాత్కాలిక చర్య మాత్రమే అనుకున్నప్పటికీ... ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పర్మనెంట్ అయ్యేలా ఉందని కంపెనీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి విధానంలోనూ ఉన్నట్లే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనూ మంచి, చెడు మిళితమై ఉన్నాయి.
అయినా సరే ఇందులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలు ఈ విధానానికి ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. ఐటీ కంపెనీలు కాకుండా తయారీ రంగంలో ఉన్న ఫిలిప్స్ లాంటి కంపెనీలు సైతం ఈ విధానానికి జై కొడుతుండటం విశేషం. ఉత్పాదకత పెరగడంతో అన్నీ సంస్థలూ వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గుచూపుతున్నాయి.