సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమలకు తరణి వయసు మహిళలు వస్తే ఆలయాన్ని మూసివేస్తామంటూ ప్రకటించారు. ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం నిషేధం ఉన్న 10 నుంచి 50 ఏళ్ల మహిళలు రావద్దని మాత్రమే తాను కోరుతున్నానన్నారు. వారు సన్నిధానానికి రావడం వల్ల సమస్యలు సృష్టించిన వారవుతారన్నారు. ఇది వివాదం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు.
'సంప్రదాయకంగా నిషేధం ఉన్న వయసు మహిళలు ఇక్కడికి వస్తే ఆలయం మూసివేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు. నెలవారీ పూజలు, వేడుకలు నిర్వహించడం మా విధి. ఈ ఆచారానికి ఎలాంటి భంగం వాటిల్లనివ్వం' అని రాజీవరు స్పష్టం చేశారు.
శబరిమల మహిళలకు అత్యంత గౌరవమిచ్చే క్షేత్రమని మర్చిపోరాదన్నారు. కాగా మహిళలు వస్తే శబరిమల ఆలయాన్ని మూసివేస్తామంటూ ప్రధాన అర్చకుడు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై కేరళ డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందో గుర్తించాలంటూ విచారణకు ఆదేశించారు.
ఇదిలావుండగా, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తప్పుల తడకలా ఉందనీ... నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనుకు గురిచేస్తూ ఈ తీర్పు న్యాయానికి పాతర వేసిందంటూ పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.