మహారాష్ట్రలోని థానెలో ఓ వివాహిత భర్తకు ఆమె మాజీ ప్రియుడు ఫోటోలు పంపించి.. ఆమె కాపురంలో చిచ్చురేపాడు. ఫలితంగా ఆ వివాహిత విషం తాగి తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే... థానె జిల్లాలోని ఖినావాలి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల వృశాలి భాగ్ రావు అనే మహిళ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ముర్‌బాద్‌కు చెందిన చేతన్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే, వివాహం కాకముందు రజాక్ పీర్ మహమ్మద్ అనే వ్యక్తితో ప్రేమపడింది. ఒకానొక సందర్భంలో వీరిద్దరు హద్దులు దాటారు. ఆసమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు తీసి భద్రపరుచుకున్నాడు.
ఈ నేపథ్యంలో వృశాలి పెళ్లయిన తర్వాత ప్రియుడితో సంబంధాలు తెంచుకుంది. దీన్ని జీర్ణించుకోలేని ప్రియుడు... ఆమె దిగిన ఫొటోలను భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. ఈ ఫొటోలు చూసి ఆగ్రహించిన భర్త వృశాలితో గొడవపడ్డాడు. వృశాలిని షాహాపూర్ తాలుకాలోని ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన వృశాలి విషం తాగి తనువు చాలించింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. దీనిపై వృశాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రజాక్‌ను అదుపులోకి తీసుకున్నాడు.