వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ నాటు వైద్యుడు ఓ మహిళ ప్రాణాలు తీశాడు. గర్భస్రావం చేయమని అడగడమే ఆ మహిళ చేసిన పాపం. ఫలితంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లా కృష్ణా గంజ్ పరిధిలోని వజ్దియా అనే గ్రామంలో అపర్ణ మజుందార్ అనే 35 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మళ్లీ గర్భందాల్చింది. దీంతో ఇక సంతానం వద్దనుకున్న సమయంలో గర్భంరావడంతో అబార్షన్ చేయమని స్థానికంగా ఉండే నాటు వైద్యుడు సుశాంత్ పొద్దార్‌ని సంప్రదించింది.
ఈక్రమంలో గర్భస్రావం అయ్యేందుకు ఆ నాటు వైద్యులు తనకు వైద్యం తెలియకపోయినా తనకు తెలిసిన మందులను రాసిచ్చాడు. ఆ మందులను వేసుకున్న అపర్ణ తీవ్ర అనారోగ్యానికి లోనైంది. హై ఫీవర్, వాంతులు, కడుపు నొప్పితో బాధపడింది. దీంతో ఆందోళనకు గురైన అపర్ణ మరుసటి రోజు తన భర్తతో కలిసి అదే డాక్టర్‌ను కలిసింది. అంతా సర్దుకునిపోతుందంటూ మరో రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు.
ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత… ఆమె ఆరోగ్యం మరింత విషమించింది. భార్యను తీసుకుని… అదే డాక్టర్ దగ్గరకు వెళ్లగా, ఆ మహిళను చూసిన వైద్యుడు.. తక్షణం కృష్ణాగంజ్‌లోని పెద్ద ఆస్పత్రిలో చేర్చాల్సిందిగా కోరాడు. దీంతో వెంటనే అక్కడకు తరలించగా, ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. దీంతో అపర్ణ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నాటు వైద్యుడుని అరెస్టు చేశారు.