Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్ట్ బెంగాల్ ఎన్నికలు : కాంగ్రెస్ ఖేల్ ఖతం - హస్తానికి సున్నా

Advertiesment
West Bengal Polls
, ఆదివారం, 2 మే 2021 (19:26 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతమెంతో ఘనకీర్తి కలిగిన జాతీయ పార్టీ నేడు పట్టుమని 10 సీట్లు సాధించలేక పోయింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 292 నియోజకవర్గాలకు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 
 
ఈ ఫలితాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించగా, బీజేపీ గణనీయంగా సీట్లను పెంచుకుంది. 204 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ, 86 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
కాంగ్రెస్‌ కూటమిగా బరిలోకి దిగగా.. ఒక స్థానంలోనే ఆధిక్యంలో ఉండడం పార్టీ దుస్థితిపై అద్దంపడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా ఈ సారి ఎన్నికల్లో.. కనీసం పది చోట్ల గెలువలేని స్థితిలోకి చేరింది. కేవలం ఒకే స్థానంలో పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో స్వాతంత్ర్యం అనంతరం 1952 మార్చి 31వ తేదీన అసెంబ్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. అప్పుడు 238 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, యునైటెడ్ సోషలిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీపీఐ, సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ మార్క్సిస్ట్ గ్రూప్) కూటమి, పీపుల్స్ యునైటెడ్ సోషలిస్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్-రుయ్ కర్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రధానంగా పోటీ పడ్డాయి. 
 
150 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత బిదన్ చంద్రరాయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి 1962 వరకు.. ఆ తర్వాత 1972 నుంచి 1977 వరకు అధికారంలో కొనసాగింది. అనంతరం ప్రతిపక్ష హోదాలో ఉంది. 
 
అయితే, 1999లో మమతాబెనర్జీ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో పార్టీ పెట్టడంతో హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత నందిగ్రామ్‌ ఉద్యమం జరగడం, మమత అధికారంలోకి రావడం వంటి పరిణామాలతో రాష్ట్రంపై కాంగ్రెస్‌ పట్టు సడలిపోతూ వచ్చింది. దీంతో చాలా మంది హస్తం పార్టీ నేతలు టీఎంసీ గూటికి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ కూటములపైనే ఆధారపడాల్సి వస్తోంది.
 
మరోవైపు బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి సిద్దార్థ శంకర్‌ రాయ్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అగ్రనేతల మరణం బెంగాల్‌లో పార్టీకి తీరని లోటుగా మారింది. ఈ సారి ఎన్నికల్లో వామపక్షాలు, ఇండియన్‌ సెక్యూలర్‌ ఫ్రంట్‌తో కలిసి పెట్టుకొని సీట్ల సర్దుబాటులో భాగంగా కేవలం 92 స్థానాల్లో పోటీ చేసింది. 
 
పోటీ మోడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా సాగడంతో కూటమిపై పెద్దగా అంచనాలు లేకపోవడం, పార్టీ అగ్రనేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉన్నారు. చివరి విడత ఎన్నికల్లో ముఖ్య నేతలు ప్రచారానికి సిద్ధమైన కరోనా మహమ్మారి ప్రభావంతో పర్యటన రద్దయింది. చివరకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖేల్‌ఖతమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున సాగర్‌లో కారు దూకుడు.. నోముల భగత్ ఘన విజయం