Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మమతా బెనర్జీపై దాడి... ఈసీ ఆగ్రహం.. విచారణకు ఆదేశం

మమతా బెనర్జీపై దాడి... ఈసీ ఆగ్రహం.. విచారణకు ఆదేశం
, గురువారం, 11 మార్చి 2021 (06:06 IST)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. కాలికి గాయమైంది. దీంతో హుటాహటిన కోల్‍కతా ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ దాడి వివరాలను పరిశీలిస్తే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఆమె నందిగ్రామ్‌ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ క్రమంలో తన నామినేషన్ వేయడానికి ఆమె నందిగ్రామ్‌కు వెళ్లారు.
 
షెడ్యూల్ ప్రకారం కోల్‌కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగ్రామ్‌లోనే ఈ రాత్రికి ఆమె బస చేయాల్సి ఉంది. అయితే దాడి నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్న ఆమె కోల్‌కతాకు తిరుగుపయనం అయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. తాను కారు ఎక్కుతుండగా తనను నెట్టేశారని తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన తన కాళ్లను చూపించారు.
 
తన పర్యటన సందర్భంగా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించలేదని మండిపడ్డారు. సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని అన్నారు. దాడిలో తన కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు. ఒక గుడిలో పూజలు నిర్వహించుకుని వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
 
మరోవైపు, ఈ ఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్కేఎం ఆస్పత్రికి తరలించారు. నందిగ్రామ్‌ నుంచి ఆమెను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 130 కిలోమీటర్ల మేర గ్రీన్‌ కారిడార్‌ ఏర్పరిచారు. ఆస్పత్రిలో ఆమె ఎడమకాలికి ఎక్స్‌రే తీశారు. ఎంఆర్‌ఐ స్కాన్‌ కూడా చేశారు. మమత ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఐదుగురు సీనియర్‌ వైద్యులను (కార్డియాలజస్ట్‌, ఎండోక్రైనాలజిస్ట్‌, జనరల్‌ సర్జరీ డాక్టర్‌, ఆర్థోపెడిస్ట్‌, మెడిసిన్‌ డాక్టర్‌) నియమించారు. 
 
కాగా.. ఆస్పత్రిలో ఉన్న దీదీని పరామర్శించేందుకు గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కార్‌ రాగా.. టీఎంసీ కార్యకర్తలు ‘గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. మమత మీద జరిగిన దాడిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్‌ అలపన్‌ బందోపాధ్యాయకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌ వివేక్‌దూబే, స్పెషల్‌ జనరల్‌ అబ్జర్వర్‌ అజయ్‌నాయక్‌ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
 
మరోవైపు, సానుభూతి కోసం మమత చిన్న ఘటనను కావాలనే పెద్దదిగా చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక.. షెడ్యూల్‌ ప్రకారం గురువారం మమత కోల్‌కతాలోని కాళీఘాట్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. మరి గురువారం దీన్ని విడుదల చేస్తారా? లేదా? అన్నది తేలాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు మద్యం తీసుకోవచ్చా?