వెస్ట్ బెంగాల్ తుది దశ ఎన్నికల్లో (ఆరో దశ) 84.25 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో శతాధిక వృద్ధుడు ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు మిడ్నాపూర్, కూచ్‌బిహార్ జిల్లాల పరిధిలోని 25 స్థానాలకు ఈ పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 16న కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 19వ తేదీన వెల్లడికానున్నాయి. కాగా, గత ఏడాది బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని ఎన్‌క్లేవ్‌ను భారత్‌లో కలిపేసిన తర్వాత దీని పరిధిలోని 9,776 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు పలు దశాబ్దాల విరామం తర్వాత 103 ఏండ్ల అస్గర్ అలీ తన జీవితంలో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఎన్‌క్లేవ్ ప్రాంతం గత ఏడాది భారత భూభాగంలో కలిసింది. ఇది గురువారం పోలింగ్ జరిగిన కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్హతా స్థానం పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అస్గర్‌అలీ కుటుంబానికి చెందిన మూడు తరాల పౌరులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.