గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు : సీఎంగా మనోహర్ పారీకర్.. ఎల్పీ తీర్మానం
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేపట్టింది. ఇందుకోసం గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన సీఎం అయితేనే తామంతా మద్దతిస్తామని, విపక్ష పార్టీతో పాటు.. స్వత
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేపట్టింది. ఇందుకోసం గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన సీఎం అయితేనే తామంతా మద్దతిస్తామని, విపక్ష పార్టీతో పాటు.. స్వతంత్ర ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో మనోహర్‌ను తిరిగి గోవాకు పంపాలని బీజేపీ భావిస్తోంది.
మొత్తం 40 సీట్లున్న గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 14 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 19, ఎంజీపికి 3, ఇతరులు నాలుగు సీట్లలో విజయం సాధించారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. మరోవైపు... ఎంజీపీ, ఇతరుల సాయంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది.
అదేసమయంలో ఆదివారం ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించింది. సోమవారం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను తెలియజేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మనోహర్ పారికర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదివారం సాయంత్రానికి బీజేపీ ప్రకటిస్తుందని సమాచారం. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయితే తాము మద్దతిస్తామని ఎంజీపీ, జీఎఫ్‌పీ, ఎన్‌సీపీ, స్వతంత్రులు బీజేపీ అధినాయకత్వానికి తెలిపినట్లు సమాచారం.