దేశంలో పెరిగిపోతున్న పెండింగ్ కేసులో, దేశ జనాభా, జడ్జీల నిష్పత్తిపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు 70 వేల మందికి పైగా జడ్జీలు అవసరముందన్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో జస్టిస్ ఠాకూర్ ఇదే అంశాన్ని ప్రస్తావించి కంటతడి పెట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ మరోమారు జడ్జీల కొరత అంశాన్ని ప్రస్తావించారు. జనాభా పెరుగుదల రేటు ప్రకారం.. పెండింగ్ కేసుల పరిష్కారానికి 70 వేల మందికిపైగా జడ్జీల అవసరముందన్నారు.
'జడ్జీల నియామకాలను సత్వరం చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అయితే ఈ నియామకాలతో సంబంధమున్న యంత్రాంగం మాత్రం చాలా నిదానంగా కదులుతోంది' అంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు జడ్జీలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో జడ్జీల కొరత ఒకటన్నారు.
దేశంలోని వివిధ హైకోర్టుల్లో మంజూరైన జడ్జీల పోస్టులు 900 కాగా వాటిలో 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరాన్ని 1987లో భారత లా కమిషన్ అప్పట్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి 44 వేల మంది జడ్జీలు అవసరమని సూచించిందన్నారు. ప్రస్తుతం కేవలం 18 వేల మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని టీఎస్ ఠాకూర్ గుర్తు చేశారు.