జయలలిత ఆరోగ్యం : అమ్మ సాక్షిగా అబద్ధాలు చెప్పాం... మంత్రి శ్రీనివాసన్
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అమ్మ సాక్షిగా అబద్దాలు చెప్పామని తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళకు భయపడి మేము జయలలిత ఆరోగ్య
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అమ్మ సాక్షిగా అబద్దాలు చెప్పామని తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళకు భయపడి మేము జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అబద్ధాలు చెప్పామని తెలిపారు. పైగా, అమ్మ జయలలిత చనిపోవడానికి శశికళ కుటుంబమే కారణమని ఆరోపించారు. ఆసుపత్రిలో ఉన్న జయలలితను శశికళ బంధువులు మమ్మల్ని ఒక్కమారు కూడా చూడనివ్వలేదని వాపోయారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది సెప్టెంబరు 22న ఆసుపత్రిలో చేరి, ఆ తరువాత డిసెంబర్ 5న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దిండిగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ... శశికళ వర్గానికి భయపడే తాము జయలలిత అనారోగ్యం గురించి కొన్ని అబద్ధాలు చెప్పామని అన్నారు. ఆసుపత్రిలో జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని తాము చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.
జయలలితను చూడడానికి ఆసుపత్రికి వచ్చిన వారిని శశికళ బంధువులు ఓ రూంలోనే కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవారని శ్రీనివాసన్ చెప్పారు. శశికళ గురించి నిజాలు చెప్పనందుకు తనను క్షమించాలని కోరారు. శశికళ మాటలు విని తాము ప్రజలకు అబద్ధాలు చెప్పామన్నారు. ఆసుపత్రిలో జయలలిత పేపరు చదువుతున్నారని, సాంబార్‌తో ఇడ్లీ తిన్నారని చెప్పామని తెలిపారు.
అందుకే ప్రజలంతా ఆమె కోలుకుంటోందనే భావించారన్నారు. నిజానికి తనతో పాటు అమ్మను ఎవ్వరూ చూడలేదని చెప్పారు. అమ్మ మాట్లాడుతోందని, ఇడ్లీ తిన్నారని ఆమెను తమ కళ్లతో చూశామని ఆనాడు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనని ఆయన పునరుద్ఘాటించారు.