బీహార్‌లోని గయా జిల్లాలోని లంగురియా కొండ జలపాతం వద్ద అకస్మాత్తుగా నీటి వరదలో పడిన ఆరుగురు మహిళలు అద్భుతంగా తప్పించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వీడియో కెమెరాలో బంధించబడింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ క్లిప్‌లో ఆరుగురు మహిళలు జలపాతం మధ్యలో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. వారి చుట్టూ నీరు ఉప్పొంగింది.
ప్రారంభంలో ఒక మహిళ ఒక బండరాయిని దాటడం ద్వారా సురక్షితంగా బైటపడింది. అలాగే చేయడానికి ప్రయత్నిస్తూ ముగ్గురు మహిళలు ఒక బండరాయిని దాటడానికి ప్రయత్నించారు. కానీ నీటిలో కొట్టుకుపోయారు. అయితే గ్రామస్తులు వారిని పైకి లాగారు. ఐదవ మహిళను జలపాతం అవతలి వైపు ఒడ్డు నుండి రక్షించారు.
ఆరవ మహిళ జలపాతం మధ్యలో చిక్కుకుంది. కొన్ని నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత స్థానికులు ఆమెను రక్షించారు. సహాయక చర్యల సమయంలో, ఒక మహిళ ఒక బండరాయిని ఢీకొట్టడంతో గాయపడింది. ఆమెను ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వాతావరణం సాధారణంగా ఉండటంతో చాలామంది జలపాతాన్ని ఆస్వాదిస్తున్నారు.
అకస్మాత్తుగా, కొండ నుండి నీరు ఉప్పొంగడంతో వరద నీటి ప్రవాహం పెరిగింది. పలువురు పర్యాటకులు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆరుగురు మహిళలు మాత్రం చిక్కుకున్నారు. ఐతే అందరూ సురక్షితంగా బైటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. లంగురియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారి అని గ్రామస్తులు తెలిపారు.