పామును చూస్తే చాలామందికి వణుకు. దాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతారు. అదే పాము బావిలో పడిపోయిందని.. తెలుసుకుని ఓ వ్యక్తి దాని ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, అహ్మదాబాద్, కసర్ పింపా గ్రామంలో.. ఓ విషనాగు.. వ్యవసాయ భూముల మధ్య గల బావిలో పడిపోయింది.
ఈ విషయాన్ని స్థానికులు వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సొసైటీకి తెలియజేశారు. ఓ వ్యవసాయి చేసిన ఫోన్ కాల్‌తో రెస్క్యూ టీమ్ పొలాల మధ్య గల బావి వద్దకు చేరింది. రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పామును కాపాడాడు. 60 అడుగుల లోతున్న బావిలో స్నేక్ క్యాచర్ నడుముకు తాడు కట్టుకుని దిగాడు. బావిలోని రాళ్ల మధ్య దాగిన పామును పట్టుకునేందుకు చేతిలో వలపట్టుకుని దిగాడు.
అయితే పాము అతనిని కాటేసేందుకు బుసలు కొట్టింది. అయినా ఆ స్నేక్ క్యాచర్ వెనుకాడకుండా పామును నీటిలో తోసి.. వలలో పట్టేశాడు. ఈ క్రమంలో స్నేక్ క్యాచర్ కాలిపై కాటేసేందుకు ఆ పాము దాడికి దిగింది. అయినా ఆ పాము నుంచి తప్పించుకున్న స్నేక్ క్యాచర్.. ఎట్టకేలకు ఆ పామును కాపాడాడు. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.