Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా టీకాల ఎగుమతిపై మారటోరియం విధించాలి : రాహుల్ గాంధీ

కరోనా టీకాల ఎగుమతిపై మారటోరియం విధించాలి : రాహుల్ గాంధీ
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:15 IST)
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ టీకాల ఎగుమతి సరికాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంటున్నారు. అందువల్ల కరోనా టీకాల ఎగుమతిపై తక్షణం మారటోరియం విధించాలని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
 
వ్యాక్సిన్ల ఎగుమతిని తక్షణమే నిలిపివేసి, దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. కరోనా మహమ్మారి కారణంగా గత యేడాది కాలంగా దేశం తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయింది. ఇప్పడు వైరస్‌ మరోసారి విజృంభిస్తోందన్నారు. 
 
మహమ్మారిని పారదోలేందుకు మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ రూపంలో పరిష్కారం కనుగొన్నారు. కానీ ఆ పరిష్కారాన్ని అమలు చేయడంలో కేంద్రం పేలవంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌ సరఫరాదారుల కృషి వృథా అవుతుండటం దురదృష్టకరమని అని రాహుల్ వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ఓ వైపు దేశంలో టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం వాటి ఎగుమతులను ఎందుకు అనుమతిస్తోందని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాలు పదేపదే కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా.. ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వస్తోందని దుయ్యబట్టారు. 
 
‘కేంద్రం తీసుకుంటున్న పొరబాటు నిర్ణయాల్లో టీకా ఎగుమతులు కూడా ఒకటా? లేదా సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలా?’ అని రాహుల్‌ మండిపడ్డారు. అంతేకాకుండా టీకా పంపిణీపై రాహుల్‌ కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేశారు.
 
టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా వ్యాక్సిన్‌ సరఫరాదారులకు అన్ని వనరులు కల్పించాలని కోరారు. టీకా ఎగుమతులపై తక్షణమే మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఇతర వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
 
అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి తీసుకురాలన్నారు. టీకాల కొనుగోలు కోసం కేటాయించిన రూ.35వేల కోట్ల బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ల కొనుగోలు, పంపిణీపై అన్ని రాష్ట్రాలకు భరోసా ఇవ్వాలన్నారు. రెండో దశలో పేద వర్గాల ప్రజలకు నేరుగా ఆర్థికసాయం అందజేయాలని రాహుల్ రాసిన లేఖలో కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యలేని భర్త.. 17 యేళ్ల కుమార్తెపై అత్యాచారం... జైలుశిక్ష