గుజరాత్ రాష్ట్రంలో కొందరు స్థానికులు నడి రోడ్డుపై వజ్రాలను ఏరుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర సంఘటన వివరాలను పరిశీలిస్తే, గుజరాష్ట్రంలోని సూరత్‌లోని వరచ్చా అనే ప్రాంతం వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి.
ఇక్కడ వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొట్టింది. నడి రోడ్డుపై పడిపోయిన ఈ వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది.
అంతే.. ఈ వార్తను తెలుసుకున్న స్థానికులు.. రోడ్డుపై పడిపోయిన వజ్రాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అణువణువూ శోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యూవెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ఫ్రాంక్ అయి వుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.