ఆరోగ్య భారతాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
వైద్య సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం అభినందనీయం. ఆరోగ్య భారతాన్ని తమ సామాజిక బాధ్యతగా గుర్తెరిగి.. ఖరీదైన వైద్యం తమకు అందదని బాధపడే వారికి అనుభవజ్జులైన వైద్యుల సలహాలు సూచనలు అందించే ప్రయత్నం ప్రశంసనీయం.
శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన భోజన పద్ధతులు మనందరం అవలంబించాలి. మనకోసం, మన చక్కని భవిష్యత్ కోసం దీన్నో తపస్సుగా స్వీకరించి ఆచరించాలి. ప్రకృతితో కలిసి జీవించాలి.. ప్రకృతిని గౌరవించాలి.. శారీరకంగా శ్రమించాలి. మంచి ఆరోగ్యవంతమైన భోజన అలవాట్లు చేసుకోవాలి.
శారీరక శ్రమ పెంచుకోవాలి. ఇది భారీకాయులకే అవసరం.. సన్నగా ఉన్నవారికి అవసరం లేదనుకోవద్దు. శారీరక దృఢత్వం ఉంటేనే శరీరంలో చురుకుదనం ఉంటుంది. దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుడు కూడా దేశ ప్రజల్లో శారీరక శ్రమ ఎంత అవసరమో పలు సందర్భాల్లో పేర్కొన్నారు.