కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయినవారంతా ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు. అలాంటివారిలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు. ఆయన శుక్రవారం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
కరోనా వైరస్ బారినపడిన కేంద్ర మంత్రి షెకావత్‌తో సీఎం ఖట్టర్ ఈ నెల 19వ తేదీన కలిశారు. అలాగే, కరోనా లక్షణాలున్న పలువురిని కలిశారు. దీంతో అప్రమత్తమైన సీఎం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మనోహర్‌లాల్ ప్రకటించారు.
ఇదిలావుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్, ఇషాన్ ఖాన్‌లకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిద్దరికీ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందింది. అయితే, అస్లాంఖాన్ (88) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
ఆయనకు బీపీ, షుగర్, హృద్రోగ సమస్య కూడా ఉండటంతో వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అస్లాంఖాన్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారని, ఆయన శరీరంలో ఆక్సిజన్ స్థాయి 80 శాతం కంటే తక్కువగా నమోదుకావడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించామని అయినప్పటికీ ఆయనను కాపాడలేకపోయామని వైద్యులు చెప్పారు.