ఇటీవలి కాలంలో కంగనా రనౌత్ కి మహారాష్ట్ర సర్కారుకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే. కంగనా రనౌత్ తనదైన శైలిలో మహా సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదనీ, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధంగా వున్నానంటోంది. సహజంగా సినీ తారలను ఎదుర్కోవాలంటే అదే రంగంలోని వారికే సాధ్యమంటుంటారు. అందుకేనేమో శివసేన ఇప్పుడు కొత్త ఫార్ములా అప్లై చేయబోతోంది.
అదేంటయా అంటే... వర్మ రంగీలా హీరోయిన్ ఊర్మిళా మంతోడ్కర్‌ను ఎమ్మెల్సీగా రంగంలోకి దింపనున్నట్లు భోగట్టా. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో కాంగ్రెస్ నుంచి నార్త్ ముంబై నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత ఆ పార్టీకి రాంరాం చెప్పేసారు. ఈ నేపధ్యంలో ఆమెకి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. పనిలో పనిగా కంగనా రనౌత్ ను ఎదుర్కొనేందుకు ఊర్మిళ సరిపోతుందనే అభిప్రాయాలు శివసేనలో వ్యక్తమవుతున్నాయట. చూడాలి వర్మ హీరోయిన్‌కి ఆ ఛాన్స్ వస్తుందో లేదో?