కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకునేలా కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిక్కుకుని పోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియకు వందేభారత్ మిషన్ అనే పేరు పెట్టింది. ఈ మిషన్ కింద అనేక దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు.
ఇందులోభాగంగా, బుధవారం ఉదయం 143 మంది ప్రవాసీయులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆ తర్వాత వివిధ జిల్లాలకు చెందిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ జిల్లా కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వారి స్తోమతను బట్టి పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.
వందే భారత్ మిషన్ తొలి విడతలో వివిధ దేశాల నుంచి భారతీయులను తరలించిన కేంద్రం.. శనివారం ప్రారంభమైన రెండో విడతలో భాగంగా మరిన్ని దేశాల నుంచి భారతీయులను తరలిస్తోంది. ఈ నెల 22 వరకు రెండో దశ కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఎయిరిండియా విమానాలు తరలివెళ్లాయి.