భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)కు నేతృత్వం వహిస్తున్నారు. సంస్థలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో ఆయన పాలుపంచుకున్నారు.
ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో కీలకభూమిక వహించారు. ఆదిత్య-ఎల్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషిచేశారు. నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. ఐఐటీ ఖరాగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగులో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తిచేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.