Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చమోలీ వరదలు.. అన్నం పెట్టిన వారి కోసం శునకం పడిగాపులు

చమోలీ వరదలు.. అన్నం పెట్టిన వారి కోసం శునకం పడిగాపులు
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (19:40 IST)
శునకానికి వున్న విశ్వాసం మరే జంతువుకు ఉండదు. అందుకే చాలామంది తమ ఇళ్లలో కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అన్నం పెట్టిన యజమాని కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధమవుతుంది. తన యజమాని కుటుంబమే తన కుటుంబంగా, వారి రక్షణే తన కర్తవ్యంగా భావిస్తుంటుంది. ఒకవేళ తన యజమాని కనిపించకపోతే నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తుంటుంది. 
 
ప్రస్తుతం ఉత్తరాఖండ్ వరద సంభవించిన ప్రదేశంలో కూడా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తపోవన్ డ్యామ్ టన్నెల్ వద్ద వందలాది మంది గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా, తనను రోజూ పలకరించి అన్నం పెట్టే కార్మికులు కనిపించకపోవడంతో ఒక కుక్క మూడు రోజులుగా నిద్రాహారాలు మాని దిగాలుగా ఎదురుచూస్తోంది.  
 
వరద తలెత్తిన హైడ్రోపవర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూటియా జాతికి చెందిన బ్లాకీ అనే ఒక నల్లని కుక్క ఉండేది. ఈ కుక్క అక్కడే పుట్టి పెరిగింది. ప్రతి రోజు అక్కడ పనిచేసే కార్మికుల వద్దకు రోజూ వచ్చేది. వారు పెట్టే అన్నం తిని ఉదయమంతా అక్కడే ఉండి, సాయంత్రం కొండ దిగువకు వెళ్లిపోయేది. ఆదివారం కూడా అలాగే సాయంత్రం వరకు ఉండి కొండ దిగువకు వెళ్లిపోయింది. ఈ తర్వాతే వరద ప్రాజెక్టును ముంచెత్తింది. ఆ తర్వాత అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆ కుక్క అక్కడి నుంచి కదల్లేదు.
 
సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బందికి ఆ కుక్క గురించి తెలియక.. దాన్ని తరిమివేయటం మొదలుపెట్టారు. కానీ, అయినా అది మళ్లీ మళ్లీ అక్కడికి వచ్చేది. అయితే, కొంత మంది స్థానికులు ఈ నల్ల కుక్కను చాలా సార్లు ఇదే ప్రాంతంలో చూశామని, దాని కథ మొత్తం రెస్క్యూ సిబ్బందికి చెప్పారు. దీంతో అప్పటినుంచి రెస్క్యూ సిబ్బంది దానికి తినడానికి తిండి పెడుతూ, రాత్రిళ్లు పడుకోవడానికి గోనె సంచి ఏర్పాటు చేశారు. కాగా, తనకు తిండి పెట్టిన వారు వస్తారని ఈ కుక్క ఎదురు చూస్తోంది. ఇలా మూడు రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టినరోజు పార్టీకి రానన్నందుకు వైకాపా కార్పొరేటర్‌ని కారుతో తొక్కించి తొక్కించి హత్య