ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు పేర్లను మార్చిన యూపీ సర్కారు ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీ అయోధ్యగా మార్చిన విషయం తెల్సిందే.
దీంతో త్వరలో అయోధ్య జిల్లాలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించనున్నట్లు యూపీ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన యూపీ సర్కారు చట్టపరంగా మద్యం, మాంసం విక్రయాలను నిషేధించనున్నట్లు ఆయన ప్రకటించారు.
జిల్లా పేరును అయోధ్యగా మార్చిన తర్వాత సాధువులు మద్యం, మాంసాన్ని నిషేధించాలని కోరుతున్నారని, అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వివరించి నిషేధం విధిస్తామని ఆయన చెప్పారు. అయోధ్య మున్సిపల్ బోర్డు ఏరియాతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.