యూపీలో ఘోరం జరిగింది. చాక్లెట్లు తిన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఖుషీనగర్ జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది.
ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు. దీంతో చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే వారు మరణించారు.
మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. వీరిలో మంజన, స్వీటీ, సమర్ తోబుట్టువులుగా పోలీసులు వెల్లడించారు.
ఇక ఇంటి ముందు దొరికిన బ్యాగులో వున్న చాక్లెట్ కవర్ల ఆధారంగా వాటిలో విష పదార్ధాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.