Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు కూడా ర్యాగింగ్‌తో సమానం : యూజీసీ

Advertiesment
ragging

ఠాగూర్

, బుధవారం, 9 జులై 2025 (09:31 IST)
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దేశగా యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, కీలక ఆదేశాలు జారీచేసింది. జూనియర్ విద్యార్థులను వేధించేందుకు సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా ఇకపై ర్యాగింగ్‌గానే పరిగణించనున్నట్టు స్పష్టంచేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ - ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
 
సీనియర్లు ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా జూనియర్లను మానసికంగా వేధిస్తున్నారని ప్రతీ ఏటా తమకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని యూజీసీ తన తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. 'ఇలాంటి చర్యలు కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయి. వీటిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయి' అని స్పష్టం చేసింది. క్యాంపస్‌లలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
 
యాంటీ ర్యాగింగ్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యే విద్యాసంస్థలకు గ్రాంట్లను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తప్పవని యూజీసీ హెచ్చరించింది. సీనియర్ల సూచనలు పాటించని జూనియర్లను సామాజికంగా బహిష్కరిస్తామని బెదిరించడం, బలవంతంగా జుట్టు కత్తిరించుకోమని చెప్పడం, ఎక్కువ గంటలు మేల్కొని ఉండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటివి కూడా తీవ్రమైన ర్యాగింగ్ చర్యలేనని పేర్కొంది.
 
ఇలాంటి పనులు విద్యార్థులలో తీవ్రమైన శారీరక, మానసిక క్షోభకు కారణమవుతాయని, ఇవి యాంటీ- ర్యాగింగ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని యూజీసీ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో విషాదం.. కల్తీ కల్లు సేవించి 15 మందికి అస్వస్థత