ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. యూపీ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 577 మంది టీచర్లు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ మేరకు యూపీ ఎన్నికల సంఘానికి టీచర్స్ యూనియన్ ప్రతినిధులు.. టీచర్ల మరణాలపై నివేదిక సమర్పించారు. మే 2న జరగాల్సిన కౌంటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని టీచర్లు కోరారు.
ఈ సందర్భంగా యూపీ శిక్షక్ మహాసంఘ్ ప్రెసిడెంట్ దినేష్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో కొంత మందికి కరోనా సోకింది. 71 జిల్లాల నుంచి 577 మంది టీచర్లు కరోనా సోకి మరణించారు అని తెలిపారు.
టీచర్ల మరణాలపై వివరణ ఇవ్వాలని అలహాబాద్ కోర్టు మంగళవారం యూపీ ఎన్నికల సంఘాన్నిఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్ వర్క్ ఆఫీసర్ ఎస్‌కే సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు టీచర్ల మరణాలపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.