ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పట్ల స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తోంది. తనపై అత్యాచారం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ పోలీసుకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఖాకీలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని తగలబెట్టి 36 గంటలు గడిచాయో.. లేదో.. మరో బాధిత మహిళ పట్ల పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తనపై అత్యాచారయత్నం చేయబోయారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమెను ఎగతాళి చేశారు.
'ఇప్పుడు రేప్ జరగలేదుగా? అత్యాచారం జరిగిన తర్వాత రా.. చూద్దాం' అంటూ పంపేశారు. ఐదు నెలల క్రితం మందులు కొనడానికి వెళ్తుండగా ఐదుగురు అత్యాచారం చేయబోయారని, వారిలో ముగ్గురిని గుర్తించానంటూ పేర్లు బయటపెట్టింది.
'ఆ ఘటన అనంతరం 1090కి ఫోన్ చేశా. వాళ్లు 100కి కాల్ చేయమన్నారు. ఆ నంబరుకి ఫోన్ చేశా. ఉన్నావ్‌లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లా. ఘటన ఎక్కడ జరిగిందో అక్కడే ఫిర్యాదు చేయమని చెప్పారు. మూడు నెలలుగా అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను' అని బాధితురాలు పేర్కొంది.
తనను చంపుతామని నిందితులు బెదిరించారని తెలిపింది. ఉన్నావ్ జిల్లా సిందుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామంలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని తగులబెట్టారు.