Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ప్రముఖులతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Advertiesment
సినీ ప్రముఖులతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
, శనివారం, 23 మే 2020 (16:12 IST)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నేడు పలు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరోన కాలంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో చర్చ నిర్వహించారు. ఇందులో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటిటిలో సినిమా రిలీజ్, రీజనల్ జిఎస్టి, టీడీఎస్, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ పలు అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ షూటింగ్లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని, అలానే అంతర్జాతీయ సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా నిర్మాణం జరిగేలా రీజినల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సినిమా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం పవర్ మినిస్టర్‌తో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వలస కార్మికుల కోసం నిధులు రిలీజ్ చేసామని, అర్బన్ ఏరియా లోని ఎమ్ఎంఇ లను పటిష్ట పరుస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ కష్టకాలంలో రాజకీయ, మత ప్రాంత భాషాభేదాలకు  అతీతంగా యూనిటీగా ఉండాలని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో 90 శాతం కేసులు పది రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. వీటిల్లో 60 శాతం కేసులు 5 నగరాల్లో, 70 శాతం కేసులు పది నగరాల్లో కేంద్రీకృతమయ్యాయి.
 
ఈ సమయంలో మాస్కులు ధరించి, స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు వలస కార్మికులకు 2000 ట్రైన్లు నడిపామని, మరికొన్ని ట్రైన్లు నడపటానికి సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్తు ఉత్పత్తి- పంపిణీలో ఉన్న అంతరాలను తొలగించేందుకు విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు.
 
కరోనా నుంచి బయటపడితే దేశం మరలా పురోగతి సాధిస్తుందని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రతి సినిమా పరిశ్రమ ప్రముఖులను పేరుపేరునా మంత్రి యోగక్షేమాలు అడిగారు. దీనిపై సినిమా ప్రముఖులు కూడా కిషన్ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తుంది అంటూ కితాబు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారి... పాకిస్థాన్‌లో 50వేలను దాటిన కోవిడ్