తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఎంట్రీ ఇచ్చిన సినీ హీరో విజయ్... వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్న విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించింది.
ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్... టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ తొలి మహానాడును గత యేడాది నిర్వహించారు. సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌ను ఆ పార్టీ కార్యవర్గం ఎన్నుకుంది. తనకు రాజకీయ అనుభనం లేకపోయినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన గతంలో ప్రకటించిన విషయం తెల్సిందే.