సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా మందికి అవమానం, ఆవేదనకు వేదికగా మారింది. ఐడెంటిటీ లేని యూజర్లు నెటిజన్లు ఇతరులను ట్రోల్ చేస్తారు. వారి మానసిక ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న చాలామంది వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వున్నాయి.
తాజాగా ఒక మహిళా టెక్కీ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడింజి. కొన్ని వారాల క్రితం, చెన్నైలోని రెండవ అంతస్తులోని ఫ్లాట్ పైకప్పు నుండి ఎనిమిది నెలల చిన్నారిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 28న ఈ ఘటన జరిగింది.
నాలుగో అంతస్తులో ఉన్న తన తల్లి చేతుల్లోంచి జారిపడి రెండో అంతస్తులోని ఫ్లాట్‌పైన ఆ చిన్నారి ఇరుక్కుపోయింది. పిల్లవాడిని రక్షించిన అపార్ట్‌మెంట్ నివాసితులు.. వీరోచిత ప్రయత్నాలను చాలా మంది ప్రశంసించగా, నెటిజన్లు తల్లిదండ్రులు వారి నిర్లక్ష్యానికి తీవ్రంగా విమర్శించారు.
ఇంట్లో ఇంత చిన్న పాప ఉంటే తల్లిదండ్రులు ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. నెటిజన్లు మాత్రమే కాదు, ఇరుగుపొరుగు వారు మరియు న్యూస్ ఛానెల్‌లు కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని విమర్శించారు.
అవమానాలు, ట్రోలింగ్‌లను తట్టుకోలేక, బాధితురాలు తన భర్త, బిడ్డతో కలిసి కోయంబత్తూరు సమీపంలోని తన స్వగ్రామం కరమడైకి తిరిగి వెళ్లింది. జరిగిన ఘటన, ట్రోలింగ్‌లు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ మహిళ.. ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.