అయ్యా అబ్బాయికి కేన్సర్... డబ్బులివ్వమంటే 17 కిలోల రూ.2000 నాణేలిచ్చారు... కేన్సర్ పేషంటే మోసుకెళ్లి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు కారణంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 47 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతోమంది తల్లిడిల్లిపోతున్నారు. చెప్పుకోలేని కష్టాలు. పచ్చనోట్లు తమవే అయినా బ్యాంకు ఉచ్చులో చిక్కుపోయి తమను కష్టాల్లోకి నెట్టివేశాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు కారణంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 47 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఎంతోమంది తల్లిడిల్లిపోతున్నారు. చెప్పుకోలేని కష్టాలు. పచ్చనోట్లు తమవే అయినా బ్యాంకు ఉచ్చులో చిక్కుపోయి తమను కష్టాల్లోకి నెట్టివేశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలోని మోహన్‌లాల్‌గంజ్‌కు చెందిన 60 వృద్ధురాలు సర్జుదేవి తన కుమారుడు కేన్సర్ వ్యాధి బారిన పడటంతో అతడికి చికిత్స చేయించుకుంటోంది.
కుమారుడికి వైద్యం చేయించేందుకు బ్యాంకుకు వచ్చి డబ్బులు డ్రా చేసేందుకు పెద్ద మొత్తాన్ని వేసింది. ఐతే బ్యాంకు అధికారులు మాత్రం 17 కిలోల బరువున్న రూ.2000 నాణేలను ఇచ్చేశారు. ఇదేమిటయ్యా... ఇంత బరువున్న నగదును నేనెలా మోయగలను... కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న నా బిడ్డ ఎలా మోయగలడు. వేరే నోట్లు ఇప్పించండి... అని వేడుకుంది ఆ వృద్ధురాలు.
కానీ బ్యాంకు సిబ్బంది మాత్రం కనికరించలేదు. ఉన్న డబ్బు ఇదే... తీసుకెళితే తీసుకెళ్లు లేదంటే వదిలెయ్ అని కర్కశంగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆ 17 కిలోలు బరువున్న నాణేల బస్తాను అనారోగ్యంతో ఉన్న తన కుమారుడి నెత్తిన పెట్టుకుని బాధతో వెళ్లిందా అభాగ్యురాలు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఎంతో ఆవేదన చెందారు. వెంటనే రూ. 1,00,000 కుమారుడి వైద్యానికి మంజూరు చేశారు.