కరోనా వ్యాక్సిన్ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆశలు పదిలమవుతున్నాయి. ఏయే వర్గాల వారికి ముందుగా పంపిణీ చేయాలో ప్రాధాన్య జాబితా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
నెలాఖరులోగా సంబంధిత జాబితాను సమర్పించాలని నిర్దేశించింది. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ట్విటర్ వేదికగా నిర్వహించే ‘సండే సంవాద్’లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ మేరకు వివరాలు నిర్దేశించారు.
టీకా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. బ్లాక్ స్థాయి వరకు పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలపై రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నామని వివరించారు. జూలై నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోస్‌ల టీకాను దేశంలోని 20-25 కోట్ల జనాభాకు సరఫరా చేయగలమని భావిస్తున్నామని పేర్కొన్నారు.
టీకాకు సంబంధించి అన్ని అంశాల పరిశీలనకు నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అధ్యక్షతన ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసిన హర్షవర్ధన్.. పంపిణీలో కొవిడ్-19 విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
‘టీకా అందుబాటులోకి వచ్చాక సక్రమంగా అందరికీ చేరడం ఎలా అన్నదానిపై కేంద్రం నిరంతరం ఆలోచన చేస్తోంది. టీకా సేకరణలో కేంద్రం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ.. నిశిత పరిశీలన చేస్తోంది. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా మా ప్రధాన లక్ష్యం. ముందుగా నిర్దేశించిన ప్రాధాన్యతల వారీగా, ప్రణాళికాయుతంగా పంపిణీ జరుగుతుంది. నల్ల బజారుకు మళ్లే అవకాశం ఇవ్వబోం’ అని హర్షవర్ధన్ వివరించారు.